ఏ వంటో చెప్పండి.. సరకులు అందిస్తాం!





ఆఫీసు నుంచి అలసిపోయి వచ్చాక బయటికెళ్లి తినాలంటే ఓపిక ఉండదు. అలాగని పార్శిల్‌ తెప్పించుకుందామంటే రుచి ఎలా ఉంటుందో తెలియదు. అలాకాకుండా.. తక్కువ సమయంలో సిద్ధం చేసుకునే, పైగా వైవిధ్యమైన వంటకాలను మీకు రుచి చూపించాలనే ఉద్దేశంతోనే ‘బిల్ట్‌ టు కుక్‌’ సేవల్ని అందుబాటులోకి తీసుకొచ్చాం. దీని ద్వారా మీరు కోరుకున్న వంటకం చేసుకోవడానికి కావల్సిన పదార్థాలన్నీ మేం తాజాగా పంపుతాం. తయారీనీ వివరిస్తాం. కేవలం మేం అందించే పదార్థాలతో పది, పదిహేను నిమిషాల్లోనే వంటకం సిద్ధమవుతుంది. సరకులు ప్రత్యేకంగా తెచ్చుకోకుండా తాజాగా, వేడిగా, శుచిగా ఇంట్లోనే ఆహారాన్ని ఆస్వాదించొచ్చు.

అధ్యయనం చేశాకే..

అల్తాఫ్‌ అని నా స్నేహితుడు ఎప్పుడూ రకరకాల పనుల మీద ప్రయాణాలు చేస్తుంటాడు. ఏ సమయానికి పడితే ఆ సమయానికి ఇల్లు చేరుకునేవాడు. వంట చేసుకునే తీరికా, సమయం ఉండేవి కాదు. అలాగని రోజూ హోటల్‌ భోజనం చేయలేక ఇబ్బంది పడేవాడు. అప్పుడే ఇంటికి ఎవరైనా సరకులు తెచ్చిస్తే చక్కగా వంట చేసుకోవచ్చని తనకి అనిపించింది. ఆ ఆలోచననే మాతో పంచుకున్నప్పుడు దాన్నే వ్యాపార మార్గంగా ఎందుకు ఎంచుకోకూడదు అనుకున్నాం. పైగా అమెరికా, లండన్‌ వంటి దేశాల్లో రెడీ టు కుక్‌ పదార్థాలకు గిరాకీ ఎక్కువ. మన దగ్గరా దీనికి శ్రీకారం చుట్టాలనే ఉద్దేశంతో ఎనిమిది నెలల క్రితం ఈ వెబ్‌సైట్‌ని ప్రారంభించాం. ముందుగా పెద్ద పెద్ద ఫైవ్‌ స్టార్‌ హోటళ్లలో చెఫ్‌లను కలిశాం. వారి దగ్గర్నుంచి దేశ విదేశాలకు సంబంధించిన వంటకాల వివరాలను తీసుకున్నాం. వాటిలో వేటికి మన దగ్గర, అదీ బహుళజాతి సంస్థల్లో పని చేసే వారి నుంచి ఆదరణ ఉందన్నది తెలుసుకున్నాం. అలా చెఫ్‌ల వివిధ దేశాల వంటకాలూ, తయారీ విధానాల గురించే కాకుండా... ఏ పదార్థాలు ఎంత మొత్తంలో తీసుకోవాలన్న జాబితా తీసుకున్నాం. కొన్నిరోజులు మా స్నేహితులకు ఈ విధంగా పదార్థాలను పంపాం. ఈ విధంగా కొన్ని నెలలపాటు అధ్యయనం చేసిన తరవాత ‘బిల్ట్‌ టు కుక్‌’ పేరుతో మా స్టార్టప్‌ను ప్రారంభించాం.

ఏం చేస్తామంటే

మా వెబ్‌సైట్‌లో పద్దెనిమిది నుంచి ఇరవై వంటకాలను ఉంచుతాం. వారానికోసారి మెనూ మారుతుంది. మా వెబ్‌సైట్‌లోకి వెళ్లి నచ్చిన వంటకాన్ని ఎంపిక చేసుకుని డబ్బులు చెల్లించాలి. అలా ఏ వంటకాన్ని కోరుకుంటే దానికి సంబంధించిన పదార్థాలన్నీ గాలిచొరని సంచుల్లో ఉంచి పంపుతాం. పంపేది ఒకరికా, ఇద్దరికా అన్నది దృష్టిలో పెట్టుకుని పదార్థాలకు సరిపడా తూచి ప్యాక్‌ చేస్తాం. మీరు ఎంచుకున్న పదార్థం చేసేప్పుడు అందులో చికెన్‌ వేయించాలని ఉంటే.. అది మేమే చేసి పంపుతాం. ఇలా అన్నీ సిద్ధం చేసిస్తాం. మా పదార్థాలను అందుకున్నాక ఇంట్లో బాణలి, నీళ్లు ఉపయోగిస్తే సరిపోతుంది. మేం పదార్థాలను ప్యాక్‌ చేసినప్పుడే వాటి మీద స్టెప్‌ వన్‌లో ఏం వేయాలో వాటన్నింటిని ఒకే సంచిలో ఉంచుతాం. సంచిమీద ‘స్టెప్పు 1’ అని రాస్తాం. అలా ఎన్ని స్టెప్పులు ఉంటే అన్ని సంచుల్లో పదార్థాలను సర్దుతాం. తయారీ విధానాన్ని బొమ్మల రూపంలో వివరిస్తాం కాబట్టి.. వెంటనే వంటకం సిద్ధం చేసుకోవడం సాధ్యమవుతుంది.. కేవలం పది నిమిషాల్లోనే నచ్చిన ఆహారం వేడివేడిగా సిద్ధమవుతుంది. ఇలా మేం రోజుకు నలభై నుంచి యాభై ఆర్డర్లు అందిస్తాం. వారాంతాల్లో ఈ సంఖ్య చాలా ఎక్కువగా ఉంటుంది.

మిగిలిపోవు

మా వెబ్‌సైట్‌ ద్వారా కేవలం హైదరాబాదీ ఫుడ్‌ మాత్రమే కాదు... ఇటాలియన్‌, మెక్సికన్‌, చైనీస్‌, జపనీస్‌, థాయ్‌ వంటకాలూ అందుబాటులో ఉంటాయి. కొత్త వంటకాలను రుచి చూడాలి అనుకునే వారి కోరికను మా వెబ్‌సైట్‌ తీర్చుతుంది. ఇలా ఆహార పదార్థాలను తీసుకోవడం వల్ల సమయం వృథా కాదు. కొత్త పదార్థాలను రుచి చూడొచ్చు, అందుకు కావల్సిన వాటిని ఇంట్లో ఉండే సేకరించొచ్చు. తక్కువ సమయంలోనే శుచిగానూ వండుకోవచ్చు. పైగా పదార్థాలు మిగిలిపోతాయన్న భయం, వాటిని నిల్వ చేయాలన్న బెంగా ఉండవు. మేం పంపే పదార్థాలన్నీ తాజాగా ఉండేలా చూసుకుంటాం. బ్రాండెడ్‌ సరకుల్నే తీసుకుంటాం. మాకు ఎలాంటి పదార్థాలను ఎంత మోతాదులో ఎంచుకోవాలన్నది చెఫ్‌లే నిర్ణయిస్తారు. ఎప్పటికప్పుడు ఫైవ్‌స్టార్‌ హోటళ్లలోని చెఫ్‌ల సాయం తీసుకుంటాం. వాళ్లే ఈ వెబ్‌సైట్‌ మొదలుపెట్టినప్పుడూ ఏ డిష్‌కి ఏయే పదార్థాలు, ఎంత మోతాదులో వాడాలన్నదీ తెలిపారు.

10 నుంచి 10 వరకు

మా సైట్‌ ద్వారా కొన్ని గంటల ముందుగా పదార్థాల్ని ఆర్డర్‌ చేయొచ్చు. వినియోగదారులు కోరుకున్న సమయానికి అందిస్తాం. ఉదయం పది నుంచి రాత్రి పది వరకూ మా సేవలు హైదరాబాద్‌ నగరమంతా అందుబాటులో ఉన్నాయి. రవాణా ఛార్జీలు తీసుకోకుండా సరకుల్ని ఇంటివద్ద అందిస్తాం. హయత్‌నగర్‌, అప్పాజంక్షన్‌, సైనిక్‌పురి వంటి దూర ప్రాంతాల నుంచి ఆర్డర్లు వచ్చినప్పుడు కనీసం రెండు డబ్బాలు ఆర్డర్లు చేయమంటాం. డిష్‌ని బట్టీ, ఎంతమందికి సరిపడా అందించాలన్న దాన్ని బట్టీ ధర ఉంటుంది. నూట ఎనభై రూపాయలు మా ప్రారంభ ధర.

పెరుగుతున్న ఆదరణ

 మాకు పిల్లల పుట్టిన రోజులప్పుడు పెద్ద మొత్తంలో అర్డర్లు వస్తున్నాయి. భార్యాభర్తలు ఉద్యోగాలు చేస్తున్నప్పుడు షాపింగ్‌ చేయడానికి ఓ పట్టాన సమయం దొరకదు. అలాంటి వారికి మా సేవలు చక్కగా ఉపయోగపడుతున్నాయి. వాళ్లు కొన్నిసార్లు రెండు మూడు రోజులకు సరిపడా ఆర్డరు ఇస్తున్నారు. అనుకోకుండా ఇంటికి బంధువులు వచ్చినప్పుడూ ప్రత్యేక వంటకాల కోసం మమ్మల్ని సంప్రదిస్తున్నారు. చాలా వరకూ ఈ స్టార్టప్‌ను నోటి ప్రచారం ద్వారానే అభివ్దృద్ధి చేశాం. ప్రస్తుతం మా సేవలు ముంబయిలో కూడా అందుబాటులో ఉన్నాయి. నేనే రెండు ప్రాంతాలకు మార్కెటింగ్‌, ఆపరేషన్‌ హెడ్‌గా వ్యవహరిస్తున్నా. రోజు రోజుకీ పెరుగుతున్న మా వినియోగదారుల సంఖ్యతో క్షణం తీరిక దొరకడం లేదు. అయితేనేం, ఈ వ్యాపార విజయంతో చాలా ఆనందంగా ఉన్నా. పడ్డ కష్టం తెలియడం లేదు.
Previous
Next Post »