పూర్వకర్మఫలం అంతా సంస్కారరూపంలో ప్రాణాన్ని, మనస్సును అంటి పెట్టుకుంటాయి. అవి పరిశుద్ధమైన కొలది భృక్తం అనే పూర్వ కర్మలు తొలుగుతాయి. లోపల ఉన్న ప్రజ్ఞ పరిమిత స్థితి నుండి అంతర్యామి స్థితిని పొందును.
ఈ యోగంలో ప్రేయర్, మూలంలోనే జరగవలసిన మార్పులన్ని జరుగును. దేహం, ప్రాణం, మనస్సు ఆత్మతో సమపాళ్లుగా ప్రభావితం అగును. సాధనలో తీవ్రత ఉండదు. శక్తుల ప్రకోపం ఉండదు. పరిమితిని మించి సాధనను ప్రయత్నించిన జరిగేది మాత్రం కావలసినంతవరకే. ఆ జీవి ప్రస్తుత పరిస్థితిని అనుసరించి సాధన జరుగుతుంది గాని, దానిని మించిన తీవ్రత సాధ్యంకాదు.
ఉపవాసాది వ్రతాలు, మడి, ఆచారం మొదలగు నిబంధనలు ఆవశ్యకాలు కావు. శుచి అనునది ఆవశ్యకం కనుక స్నానాధ్యనుష్ఠానాలు తప్పవు. శుచిగా ఉండనక్కరలేదను వాదం మలినమైనది. స్నానాదులు వంటివి అనుకూలం కానప్పుడు ప్రేయర్ మానుకోనక్కరల్లేదు అని మాస్టరుగారు చెప్పారు.
దానికి విపరీత వ్యాఖ్యానంగా స్నానాదులు అక్కరలేదని పాషండ వాదన చేయటం సోమరితనానికి ఫలశ్రుతి. కాని దినచర్య అంతా స్నాన సంధ్యాధి నిబంధనలకే వ్యర్ధపరచే కఠోరకాండ నిషేధింపబడింది. ‘ఈశరీరంలో ఉన్న జీవుని కఠోర దీక్షలతో శుష్కింపచేసేవారు మతిలేనివారు’ అని శ్రీకృష్ణుడు భగవద్గీతలో చెప్పాడు.
అనుష్టానానికి ముందు ఆహారం స్వీకరించరాదనే నియమం మానవులు ఏర్పరచుకున్నాదే గాని దేవుడు చెప్పింది కాదు. తండ్రి భగవంతుడు తన బిడ్డలు తనకన్న ముందు భుజించిన కోపించటం, శోకించటం చేయడు. మాస్టరుగారి మార్గంలో యోగసాధనతో అన్నమయ, ప్రాణమయ కోశాలు సరిచేయబడుతుంది, లఘువైన ఆహారం స్వీకరించిన తర్వాత ప్రేయర్ చేయకూడదనే నియమం కలదు. ఆకలి కడుపుతో యోగసాధనం హాస్యాస్పదం. ‘తిండిపోతుకు, నిద్రపోతునకు, ఉపవాసం చేసేవానికి, నిద్ర లేనివానికిగాని యోగం లేదు.
తగుమాత్రం ఆహార విహారాలు గలవాడు, ఆచరించు కర్మలలో తగిన చేష్టలు అనగా ప్రవర్తన(నిష్కామం)ను కలవాడు మాత్రం యోగం కలవాడు’ అని శ్రీకృష్ణుని బోధ. ‘ఆచమ్య ప్రాణానాయమ్య’ (ఆచమించిన పిదప మాత్రమే ప్రాణాయామం చేయవలెను) అనునది వేద సంప్రదాయం. ఒకప్పుడు కుంభకోణంలో యోగసాధకులలో కొందరు ఆహారం స్వీకరించి, కొందరు స్వీకరింపక కూర్చున్నారు. ప్రేయర్ నుండి లేచేసరికి కూర్చున్న వారు ఆకలితో తహతహలాడుతూ, స్వీకరింప కూర్చున్నవారు సామా న్యంగా ఉండిపోవటం సంభవించేది.
అందరు కలసి స్వీకరించాలి. కాని ప్రేయర్ సమయంలో అందరి ప్రాణమయ శరీరాలు ఒకే వ్యక్తిగా(మాస్టరుగా) పనిచేయటంతో తిన్నవారి నుండి తినని వారికి సరఫరా జరిగి సామ్యం స్థాపింపబడి లీలాప్రాయంగా మాస్టరుగారు చూపిన నిదర్శనాల్లో ఒకటి. కుంభకోణంలో మాస్టరుగారు తమ సన్నిధిలో సాధనచేస్తున్న వారికి ఇడ్లి, కాఫీ ఇచ్చి సాధనలో కూర్చోపెట్టేవారు. ఈ యోగసాధనలో ఇడ్లీ, కాఫీలే అవశ్యకాలని నియమం చేసుకొన్న పూర్వాచార పరాయణులు ఏర్పడ్డారు. జింక చర్మం లేనిచో జపం చేయటం ఎట్లా అనువాదం వంటిదీ మతం.
ఉల్లిపాయలు తినరాదు అని మున్నగు నియమాలను పెట్టటానికి మాస్టరుగారికి తీరికలేదు. ‘ఆహార శుద్ధౌ సత్వశుద్ధిః’ ఆహార పరిశుద్ధిని బట్టి మనస్తత్వ స్థితి నిలబడుతుంది. చమురును బట్టి దీపానికి రంగు ఏర్పడుతుంది. కనుక నిషేధాలను అల్ప విషయాలను గురువులకు వదిలి వారి కాలహరణం చేయుట, మన వ్యామోహాలను బట్టి చేసే పనులలో స్వతంత్య్రబుద్ధి చూపుట పాత్రతను చెడగొడుతుంది. ఆహారం మున్నగు స్వల్ప విషయాలను మనం నిర్ణయించుకోవాలి. మనల్ని గురువులకు సమర్పించాలి.
ఈ పదార్ధం తినవచ్చు, తినరాదు అను నిషేధం సృష్టిలో లేదు. ఎవరు తలపెట్టిన కార్యక్రమాన్ని అనుసరించి వారు మలచుకోవాలి. యోగమార్గ అవలంభించేవారు రస్యాలు, స్నిగ్థాలు, ఆయు ర్వర్థనాలు, సత్వాన్ని, బలాన్ని వృద్ధిచేసేవి అగు పదార్థాలను సేవించాలి.
పులిసినవి, రుచి తప్పినవి, తీక్షణాలు(నాలుగ చుర్రుమనేవి) రూక్షాలు(ఎండు దినుసులు) విదాహకాలు (లోపల వేడి పుట్టించునవి) మానవలెనని, నేర్పరితనంతో శ్రీకృష్ణుడు చెప్పాడు. ఇట్టి శాస్త్రవాక్యాలనను అనుసరించి వ్యక్తిగత ఆహార విహారాది విశేషాలను ఎవరికి వారు సమన్వయిం చుకోవాలేగాని ఈ నియమాన్నింటిని మాస్టరుగారు చెప్పలేదనిగాని, చెప్పారనిగాని భావింపరాదు.
EmoticonEmoticon