త్రిగుణాత్మక స్వరూపిణి






సర్వేంద్రియాలకు ఆధిపత్యం వహించేది ‘హృదయం’ హృదయపీఠం అంటేనే అతిగొప్ప అనుభూతిగా పండితులు అభివర్ణించారు. ఎంత గొప్ప హృదయం అయినా ఆత్మ స్వరూపంగా ఉండడం వల్ల బహిర్ముఖంగా కనబడదు. ఎటువంటి మాలిన్యం అంటనివ్వని శుద్ధతత్వం ఒక్క హృదయానికే సాధ్యం.

అంతఃకరణాల శుద్ధితో హృదయం గొప్ప స్ఫటికంలా, పరమ స్వచ్ఛతతో రాగద్వేషాలకు అతీతమైతేనే ఆమె సాక్షాత్కారిస్తుంది. నియమనిష్టలతో సాధన చేస్తూ, హృదయ శుద్ధత కుదిరినప్పుడే ‘ఆత్మసాక్షాత్కారం’ కాగలదు.

హృదయానికి కల్మషం అంటనీయకపోవడమే ఒక తపస్సు. ఆంజనేయస్వామి తన హృదయాన్ని చీల్చి సీతారాముల చిద్రూప దర్శనం ఇచ్చాడని రామాయణంలో అద్భుతంగా వర్ణించారు. శరీరం నుండి హృదయాన్ని విడదీసి, విమర్శనాత్మక దృష్టితో చూడగలగడమే అంతఃర్ముఖం. అదే శుద్ధబ్రహ్మం. అది అత్యంత  రమణీయ మైంది. అందుకే ఎవరి హృదయం వారికి ఎంతో కమనీయమైంది. దానిని అతి పవిత్రంగా ఉండనిస్తేనే సర్వ దేవతల నిలయానికి అది స్థావరమౌతుంది.

‘రవిప్రఖ్యా’: హృదయం సూర్యమండల స్థానం. విద్యా ద్వితీయ కూటమిది. అందువల్ల రవిప్రఖ్యా అంటే సూర్యసమాన కాంతి అని అర్థం. విమర్శ బింద్వాత్మకమై ఆధారంగా ఉండే దేవి. మణిపూర, అనాహతాలు సూర్యమండలాలు. కావున ఆమె సూర్యరూపంతో ఉన్నది.

అగ్ని రూపంలో - ఉదయం పూట

సూర్యరూపంలో - మధ్యాహ్నవేళ

చంద్రరూపంలో - సాయం సమయంలో

ఈ తేజస్వరూపిణి భక్తులతో ధ్యానింపబడుతున్నది.

‘రవిప్రఖ్యా’ మధ్యాహ్న సూర్యుడిని రవి అని చెప్పారు. ‘ర’ అంటే రగులుతూ, ‘వి’ అంటే విజృంభించేవాడు. విజృంభించి పరాకాష్టకు చేరిన సూర్యుడే రవి అవుతాడు. మధ్యాహ్నపు మార్తాండుణ్ణి రవిగా అర్థం చెప్పుకుంటే రవి లాగా ప్రఖ్యాతి పొందడం వెలుగొందడం అని లేదా ఉచ్ఛారణతో ప్రకాశించునది అని అర్థం.

మధ్యాహ్న కాలంలో హృదయంలో అమ్మవారు ఉన్నట్లు భావించి, ధ్యానించాలని చెప్తారు. అందుకే రెండు నామాలు హృదయస్థా, రవిప్రఖ్యా అని రెండింటినీ కలిపి చదువుకోవాలి.
Previous
Next Post »