వనజాతిలో విశిష్టమైనవి ఇండోర్ మొక్కలు. సాధారణంగా వెలుతురు, ఎండా ఉంటేనే మొక్కలు పెరుగుతాయి. ఇవి లేకుండా కూడా చక్కగా పెరిగే మొక్కలు ఇండోర్ మొక్కలు.
నీడలోనూ పత్రహరితం తయారుచేసుకుని పెరిగే ఇవన్నీ శీతల దేశాలకి చెందిన మొక్కలే. అందుకే చల్లని ప్రాంతాల్లో ఇవి వేపుగా పెరుగుతాయి. కుండీల్లో పెంచుకునే ఇవి బెడ్‌రూం, టీపారు, కబోర్డ్, అల్మారా, దర్వాజా, వంటగదిలో, డైనింగ్ టేబుల్, హాలు ఇలా ఎక్కడైనా ఇంటి లోపల అందంగా కొలువుదీరి, ఆకర్షణ గా అలరిస్తాయి. మొక్కల ధర కాస్త ప్రియమే అయినా ఎంతో ఇంపుగా ఉంటాయి. మిగతా మొ క్కల్లా కాకుండా మరింత జాగ్రత్త తీసుకుని, వీటిని రక్షించుకోవాలి.
ఆంథోరియం
స్వాతోఫిలం
తెల్లని అపురూప పూల ఇండోర్ మొక్క స్వాతోఫిలం. ఇది రెండు నుంచి రెండున్నర అడుగుల ఎత్తు వరకూ పెరుగుతుంది. మధ్యలో సన్నని కాడ వచ్చి, దానికి తెల్లని పువ్వు విచ్చుకుంటుంది. దూటలాంటి పుప్పొడి ఒకటి పువ్వుని అంటిపెట్టుకుని మరింత అందం అద్దుతుంది. పాము పడగ విప్పినట్టు ఉండే ఈ పువ్వు గాలికి ఊగుతుంటే నయనానందంగా ఉంటుంది. దీన్ని పీస్ లిల్లీ అని కూడా అంటారు. ఇవి నిత్యం పూస్తాయి. కానీ శీతాకాలంలో ఎక్కువగా పూస్తాయి. పువ్వు మొక్కనే ఉంచితే రెండు, మూడు రోజులు తాజాగానే ఉంటాయి.
ఆగ్లోనిమా స్నో వైట్
ఇండోర్ మొక్కలకు పెట్టింది పేరు ఆగ్లోనిమా. ఇందులో వందల రకాలున్నాయి. వీటి ఆకులు రంగు రంగుల్లో కొలువుదీరి ఉండటం వీటి ప్రత్యేకత. స్నోవైట్ వెరైటీ ఒక అపురూపం. ఇవి ఆకుపచ్చని ఆకులపై తెల్లని రంగు చిలికినట్టు మచ్చలు భలే ఉంటాయి. ఆకులు చాలాకాలం నిగారింపుగా ఉండి, వీనులు విందు చేస్తాయి.
ఆగ్లోనిమా లిప్స్టిక్
మరో నాజూకు మొక్క ఆగ్లోనిమా లిప్స్టిక్. మొక్క కాండం ఆకుల చుట్టూతా, ఆకు మధ్యలో ఉంటుంది. దీని ఈనె భాగము లేత గులాబి రంగులో ఉండి, పత్రాలు ఆకుపచ్చగా ఉంటాయి. ఆగ్లోనిమా ఏ కాలంలోనైనా నవనవలాడుతూ ఉంటుంది.
జామియా కులకుస్
ఆక్సిజన్ ప్లాంటుగా ఇటీవల బహు ప్రాచుర్యం పొందుతున్న మొక్క జామియా కులకుస్. పొడవాటి కాండము దానికి రెండువైపులా అందంగా గుచ్చినట్లు పత్రాలు.. ఎంతో శోభాయమానంగా ఉంటాయి. దళసరిగా చిన్నగా ఉండే ఆకులే ఈ మొక్క ప్రత్యేకత. తెలుపు, పసుపు, ఆకుపచ్చ, లేతగోధుమ రంగుల కలబోతతో ఆకులుండే సరికొత్త హైబ్రీడ్ డ్వార్ప రకాలూ ఇటీవల అందుబాటులోకి వస్తున్నాయి. అలాగే ముదురు చింతపిక్క రంగులో ఉండే అరుదైన జామియా కులకుస్ మొక్క కూడా అందుబాటులోకి వస్తోంది. అరుదైన ఈ రెండు మొక్కలూ ధరలో ప్రియం. వేలల్లో పలుకుతాయి. ఇవి ఇంటి లోపలి వాతావరణంలోని కార్బన్ డై ఆక్సైడ్‌ను పీల్చుకుని, ఆక్సిజన్‌ను ఎక్కువగా విడుదల చేస్తాయని ప్రచారంలో ఉంది.
అల్పేనియా జెరమ్బట్
అపురూపమైన మొక్క అల్పేనియా జెరమ్బట్. ఆకుపచ్చ, పసుపు రంగుల షేడ్‌తో ఆకులు చక్కగా ఉంటాయి. తళుకుల కాంతులతో ఆకులు అచ్చంగా ప్లాస్టిక్‌లా ఉంటాయి. ఒక్కో ఆకు నెలలు తరబడి ఉంటుంది. కాండము గోధుమ రంగులో కొత్తగా వచ్చినట్లు కనిపిస్తుంది.
అరేలియా స్నోటాప్
చూడచక్కని మొక్క అరేలియా స్నోటాప్. చిన్ని చిన్ని ఆకులతో మొక్క చెట్టు ఆకారంగా విస్తరించి ఉండటం దీని ప్రత్యేకత. రెండడుగులు ఎత్తు వరకూ పెరుగుతుంది. ఆకుపచ్చని ఆకులకి చుట్టూతా చివరి భాగాల్లో తెల్లని షేడ్ ఉంటుంది. కుండీల్లో పెంచే ఈ మొక్క అడుగుభాగాన తెల్లటి పాలరాతి ముక్కలు ఉంచడం ఒక ట్రెండ్‌గా మారుతోంది.
EmoticonEmoticon