వంకాయ తప్పు

నానక్ చంద్ గారు పండితులు, ఊళ్లో ఉన్న
గుడులలో అతి పెద్ద గుడికి పూజారి. ఊర్లో
ఆయనకంటూ అభిమానులు చాలా మందే
ఉండేవాళ్ళు, ప్రతిరోజూ ఉదయం , సాయంత్రం
ఆయన గుళ్లో ప్రవచనాలు చేసేవాడు, ఆయన ధార్మిక
ప్రసంగాలు వినేందుకు జనాలు పెద్ద సంఖ్యలో
హాజరయ్యే వాళ్లు. ఆ ప్రసంగాలకు ఆయన భార్య
లక్ష్మి ప్రతి రోజు వచ్చేది కాదు గానీ,
అప్పుడప్పుడూ వస్తూండేది.
ఒకరోజు సాయంత్రపు సభకు ఆమెకూడా
హాజరైంది. ఆ రోజున పండితుల వారు భగవద్గీత
ఆరో అధ్యాయం వివరిస్తున్నారు. గీతలో కృష్ణుడు అర్జునుడికి చెబుతున్నాడు,
'మనసుని ఏకాగ్రం చేసేదెట్లాగ, దాన్ని అదుపులో
ఉంచుకునేదెట్లాగ ' అని. "మనసుని అదుపు
చేసుకుంటే తప్ప, మనం నిత్య జీవితంలో ఎదురయ్యే మామూలు పనుల్ని కూడా చెయ్యలేము" అని, పండితుల వారు ఏవేవో
క్లిష్టమైన శాస్త్ర విషయాలు చెప్పసాగారు.
చెప్తూ చెప్తూ ఆయన యథాలాపంగా మామూలు
విషయాలు ముచ్చటించటం మొదలు పెట్టారు:
"ఉదాహరణకు, వంకాయనే తీసుకోండి, దాని రంగు
ఎలా ఉంటుందో చూడండి." అన్నారాయన. "ఊదారంగు మచ్చలు- కానీ నలుపు తిరిగి !
ఒక్కోసారి పూర్తి నలుపు! చూస్తే నిజంగానే చాలా వెగటు పుట్టించే కాయ అది! ఇక దాని రుచి?
వగరు! దాదాపు చేదు! దాన్ని హిందీలో 'బైంగన్' అంటారు. దాని మూలం 'బేగుణ్'- 'ఎలాంటి
మంచి గుణాలూ లేనిది' అని దాని అర్థం!
నిజంగానే ఆయుర్వేదం ప్రకారం వంకాయలో మనిషికి హాని చేసే
గుణాలున్నై గాని, మంచి గుణం ఒక్కటీ లేదు. వంకాయ పై పరిశోధనలు చేసి, దానిలో మనకు హాని చేసేవి ఏవీ లేవని తేలితే తప్ప, నిజానికి మనం
ఎవ్వరమూ వంకాయను తిననే కూడదు! ఇవన్నీ
కాదంటే కూడాను, వంకాయలు పరమ ఖరీదు!చవకగా దొరకనే దొరకవు! ఇక ఎవరైనా అలాంటి
కూరగాయ మీద డబ్బులు ఎందుకు వృధా చేసుకోవాలి?" అని ఇదే ధోరణిలో ఒక పది నిముషాలు మాట్లాడారు.
ఈ మాటలు వింటున్న లక్ష్మికి కంగారు ఎక్కువైంది. ఆ రోజు రాత్రి తినేందుకని ఆమె ఇంట్లో వంకాయకూరే చేసి పెట్టి వచ్చింది మరి! అందుకని, నానక్ చంద్ గారి ప్రసంగం పూర్తయ్యే లోగానే ఆవిడ లేచి, నిశ్శబ్దంగా
బయటపడి, నేరుగా ఇంటికి పోయింది. వండి పెట్టిన వంకాయ కూరనంతా చెత్తకుప్పలో
పడేశాక, 'త్వరగా అయ్యే వంటకం ఏముందా' అని
ఆలోచించి, ఆమె వేడి వేడి పెసర గంజి చేసి పెట్టింది,హడావిడిగా.
ఇక పండితుల వారు ప్రసంగం ముగించి ఆకలిగా
ఇంటికొచ్చి చూస్తే, తినేందుకు గంజి తప్ప మరేమీ లేదు!
"ఇదేమిటి? 'రాత్రి భోజనానికి ఇలా గంజి ఒక్కటే చాలు '
అని నీకెవరు చెప్పారు? ఈ రోజు ప్రొద్దున్నే నేను
కొన్ని మంచి వంకాయలు తెచ్చాను కదా? వాటినైనా
వండి ఉండవచ్చునే?" అన్నారాయన భార్యతో.
"నేను వాటినే వండానండీ! వంకాయ కూరే చేసిపెట్టి
వచ్చాను- మీ ప్రసంగం వినేందుకు! అయితే
మీరు వంకాయ గురించి చెప్పినవన్నీ విన్నాక, 'ఇక
వాటిని తినరేమో' అనిపించి, ఆ కూరనంతా ఎత్తి
చెత్తకుప్పలో పడేసాను. కొత్తగా ఈ గంజిని వండాను మళ్లీ!" అన్నదామె, సంజాయిషీ ఇచ్చుకుంటూ.
"అయ్యో! ఎంతపని చేశావు! వినటం రాకపోతే ఇట్లాగే
ఉంటుంది! ఉపన్యాసం మధ్యలో ఇక ఏం చెప్పాలో గుర్తు రాక, వంకాయ గురించి మొదలు పెట్టాను.
ఎంత ఆలోచించినా తర్వాతి శ్లోకం గుర్తురాలేదు మరి- ఏం చెయ్యను? అందుకని వంకాయ మీద
యుద్ధాన్ని కొనసాగించేశాను!. ఇన్నేళ్ళ కాపురం తర్వాతకూడా నన్ను అర్థం చేసుకోకపోతే ఎలాగ?
ఉపన్యాసాన్ని నువ్వు ఈ చెవిలోంచి విని, ఆ చెవిలోంచి వదిలెయ్యాలి- నిజానికి ఉపన్యాసాలు
వినేవాళ్ళంతా చేసేది ఆ పనే కదా,
అంతమాత్రం తెలీదా?"
అని బాధ పడ్డారు
పండితులవారు-
చెత్తకుప్పలోకి అన్యాయంగా చేరుకున్న వంకాయకూరను
తలచుకుంటూ!
Previous
Next Post »