పోటీ ప్రపంచంలో ముందుకు దూసుకు వెళ్లాలంటే... ఉన్న అర్హతలే సరిపోవు. తామున్న రంగం నుంచి గానీ, ఉద్యోగం నుంచి గానీ మారాల్సి వచ్చినప్పుడో, ఏదైనా కారణాల వల్ల తొలగించబడితేనో ఇంకా ఉపాధికో, ఉద్యోగానికో అవసరమైన అర్హత, నైపుణ్యం కలిగి ఉండాలంటోంది నేటి యువత.
అందుకోసం అవసరమైన ప్రణాళికను ముందుగానే రూపొందించుకుంటే మేలు చేకూరుతుందని అభిప్రాయపడుతోంది. ముఖ్యంగా ఈ మధ్య కాలంలో కొలువులూ, రంగాలూ మారుతున్న యువత సంఖ్య పెరుగుతోంది. అవసరాలో, ఆసక్తో వారిని ఆ విధంగా ప్రేరేపిస్తోంది. కొన్నిసార్లు అనివార్యంగానూ ఇతర సంస్థలోకో, రంగంలోకో జంప్ అవ్వాల్సిన పరిస్థితి ఏర్పడుతోందని పలువురు చెబుతున్నారు.
అమెరికాలోని ఒక కంపెనీలో హైదరాబాద్‌కు చెందిన వ్యక్తి గతంలో ఫైనాన్స్ అడ్వయిజర్‌గా వుండేవాడు. ఆ మధ్య అక్కడ ఏర్పడిన ఆర్థిక మాంద్యం వల్ల వేతనం తగ్గించారు. అదీ సమయానికి అందక ఇబ్బంది పడాల్సొచ్చింది. ఆ కొద్దిపాటి వేతనంతో అక్కడ బతకడం కష్టం. అందుకే ఇక్కడే ఏదైనా ఉద్యోగం చూసుకుందామని ఇండియా వచ్చాడు.
అయితే తన అర్హతకూ, స్కిల్స్‌కూ తగిన ఉద్యోగం ఇక్కడ దొరుకుతుందన్న నమ్మకం అతనికి కుదరలేదు. అందుకే ఐదారు రంగాలకు సంబంధించిన స్కిల్స్ పెంచుకునేందుకు అధ్యయనం చేశాడు. అయితే ఇలాంటి పరిస్థితి వస్తే ఎదుర్కోవడానికి ఈతరం యువత ముందు జాగ్రత్త తీసుకుంటోంది. తమ రంగంతో పాటు ఇతర రంగాల పట్ల కనీస పరిజ్ఞానమో, అవసరమైతే లోతైన అవగాహనో పెంచుకుంటోంది. అన్ని వృత్తుల్లోనూ, అన్ని రంగాల్లోనూ రాణించేందుకు అవసరమైన స్కిల్స్‌ను పెంచుకుంటున్నారు. దానికి ‘ట్రాన్స్‌ఫర్‌బుల్ స్కిల్’ అనే పేరు కూడా పెట్టారు.
ఇవన్నీ ఉండాలి..
కమ్యూనికేషన్ స్కిల్స్ బడ్జెట్ మేనేజ్‌మెంట్ స్కిల్స్, పబ్లిక్ రిలేషన్ స్కిల్స్, టైమ్ మేనేజ్‌మెంట్ స్కిల్స్, టీచింగ్ స్కిల్స్, రైటింగ్ స్కిల్స్, మెయింటెన్స్ స్కిల్స్ అవసరాన్ని బట్టి ఇంకా ఇతర స్కిల్సూ అవసరమవుతాయి.
కమ్యూనికేషన్ స్కిల్స్
ఎవ్వరితోనైనా చక్కగా స్పస్టంగా, అర్థమయ్యేలా, ఆకట్టుకునేలా మాట్లాడగలిగే నైపుణ్యం ఉండాలి. ఎదుటివారు చెప్పేది ఎంత రిస్కుతో కూడినదైనా ఓపికగా, సహనంతో విని, వారిని మెప్పించే విధంగా సమాధానం ఇవ్వగలగాలి.
బడ్జెట్ మేనేజ్‌మెంట్ స్కిల్స్
పరిస్థితిని బట్టి, నష్టం చేకూరని విధంగా వనరులనూ, డబ్బులనూ ఎలా వినియోగించుకోవాలో దీని వల్ల తెలుస్తుంది. సంస్థగానీ, కంపెనీగానీ లాభాల్లో నడవడానికి ఇది ఎంతో అవసరం.
పబ్లిక్ రిలేషన్ స్కిల్స్
తామున్న రంగంలో గానీ, ఉద్యోగంలో గానీ ప్రజాసంబంధ వ్యవహారాల గురించి అవగాహన కలిగి ఉండాలి. ప్రజల్లో అవగాహన కలిగించేందుకు ప్రణాళికలు రూపొందించాలి. నలుగురిలో కలిసిపోయే తత్వం అలవర్చుకోవాలి.
టైమ్ మేనేజ్‌మెంట్ స్కిల్స్
చేసిన పనికి సమయమూ, సందర్భమూ ఉండాలి. అలా లేకపోతే దానికంత ప్రాధాన్యం ఉండదు. అందుకే ఎంత హోం వర్క్ అయినా నిర్దేశిత సమయంలో, అవసరమైతే అంతకంటే ముందే పూర్తిచేసేలా ప్లాన్ చేయాలి. ఏ విషయాన్నయినా చక్కగా చెప్పే నైపుణ్యం, చేసే నైపుణ్యం అందకు ఆదరణ లభించేలా ప్రణాళికా తయారు చేసే నైపుణ్యంతో పాటు పరిస్థితులకు అనుగుణంగా స్కిల్స్ డెవలప్ చేసుకోవాలి. అదే అన్నింటికీ అదనపు అర్హత చేకూరుస్తుంది.
రైటింగ్ స్కిల్స్
చక్కగానూ, తప్పుల్లేకుండానూ రాసే నైపుణ్యం ఉండాలి. సందర్భానికి తగ్గట్లుగా నివేదికలు రూపొందించే భాషా పరిజ్ఞానం ఉంటే అది సాధ్యమవతుంది. బ్రోచర్లకూ, వెబ్ పేజీలకూ, నివేదికలకూ, ప్రకటనలకూ ఇలా రాసే సబ్జెక్టును బట్టి కూడా అందులో నైపుణ్యమూ, సమయస్ఫూర్తి ప్రదర్శించాల్సి ఉంటుంది.
టీచింగ్ స్కిల్స్
నేర్చుకున్న విషయాలను ఇతరులకు వివరించాలి. కేవలం వివరణే కాదు అందులో ఎదుటి వారిని మెప్పించే గుణం ఉండాలి.
మెయింటెన్స్ స్కిల్స్
తమ వృత్తికి సంబంధించిన బాధ్యతలు అప్పగిస్తే వాటిని మెయింటెనెన్స్ చేసే సామర్థ్యం సంపాదించుకోవాలి. సమయస్ఫూర్తి ప్రదర్శించాలి. ఈ స్కిల్స్ అన్నీ మీలో వుంటే చాలు ఏ కెరీర్‌లోనైనా రాణించవచ్చు.
EmoticonEmoticon