మచిలీపట్నం శ్రీ సాయిమహరాజ్ దేవాలయం





అనాది నుండి మహానుభావులను దేవుళ్లుగా కొలిచే హిందూ సంప్రదాయంలో గురువులుగా పూజలందుకుంటున్న అతికొద్ది మందిలో సాయిబాబా ఒకరు. (గురువుకు, దేవుడికి మధ్య చిన్న వ్యత్యాసం ఉంది) దేవుడు గురువు ఇద్దరూ ఇతరుల మంచి కోరేవారే అయినా దేవుడు కోరిన వరాలు ప్రసాదిస్తాడు. గురువు వరాలు తీర్చే శక్తిని సమకూర్చుకునే దారి చూపిస్తాడు.

దేవుడిని  పూజిస్తూ, కీర్తిస్తూ ఉండటం వల్ల వాళ్ళు చెప్పే హితబోధ చెవికి కూడా ఎక్కించుకోలేకపోతున్నాం. గురువులు చెప్పేవి విని వాటిని ఆచరిస్తూ, వారి అడుగు జాడల్లో నిలుస్తూ, వారి జీవన గమనాన్ని సరైన దారిలో పెట్టుకోగలుగుతున్నారు నేటి కలియుగ వాసులు.

కుల, మత సామరస్యతల  మధ్య గడుపుతున్న ప్రజలకు కనువిప్పు కలిగేందుకు గాను సాయిబాబా గురువుగా అవతరించి తరింపచేశాడు. అటువంటి సాయిబాబా దేవాలయం నిర్మాణం గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో చోటు సంపాదించుకుంది. ఆ దేవాలయ వివరాల గురించి తెలుసుకుందాం. 



కృష్ణాజిల్లా, మచిలీపట్నంలో నిర్మించిన శ్రీ సాయిమహరాజ్ దేవాలయం ఒక అద్భుతమైన నిర్మాణం. సాయబాబా భక్తుడైన లక్ష్మీపురమ్ విఠల్‌రావు 1994లో షిర్డీ నందు గల ద్వారకామయిలో ధ్యానం చేస్తుండగా కులమతాలకు అతీతంగా ఆలయ నిర్మాణం చేయమని మాటలు వినిపించాయి. అది బాబా ఆదేశంగా భావించీ ఒక పాకలో సాయిబాబా ఫొటోతో ప్రారంభించారు.

తర్వాత భక్తుల నుండి వచ్చిన విరాళాలతో మొదటగా ధుని, సాయిబాబా చిన్న విగ్రహంతో ఆలయ నిర్మాణం రూపుదిద్దుకుంది. ఆ తర్వాత “నీవు నన్ను ఎక్కడ, ఎప్పుడు స్మరిస్తే ఆ క్షణమే నీ చెంతనుంటాను” అని పలికిన సాయి పలుకులు నిజమని నిరూపిస్తున్నట్టుగా..

ఆర్తితో పిలిస్తే రావటానికి సిద్ధంగా ఉన్నానంటూ, తన కఫ్నిని ఎడమచేత్తో పట్టుకోగా, కుడిచేత్తో అభయహస్త ముద్రతో నిల్చొని ఉన్న 7.2 అడుగుల ఎత్తుగల ఏకశిల అయిన తెల్లటి చలువరాతితో ప్రాణం పోసుకున్న నిలువెత్తు విగ్రహాన్ని 1998లో ప్రతిష్ఠించారు. అక్కడ నిర్వహించే కార్యక్రమాలతో ప్రజల్లో భక్తి భావం, సేవాతత్పరత పెరగడమే కాకుండా, ప్రతి రోజూ చిన్నా, పెద్దలు పాల్గొని కులమతాలకు అతీతంగా సత్సంగానికి హాజరై బాబా వివరించిన శ్రద్ధ, సబూరి వాక్యాల్లోని మర్మాలను అర్థం చేసుకుంటూ భక్తిని కనపరిచేవారు.



ఈ విధంగా హాజరైన వారి కోర్కెలను నెరవేర్చే దైవంగా సాయిబాబా ప్రసిద్ధి పొందాడు. అంతేగాకుండా ఎక్కడో అందనంత ఎత్తులో, అదృశ్యరూపంలో ఉండే భగవంతుడిలా కాక వెన్నంటే ఉండి ముందుకు నడిపిస్తున్న గురువులా, మరో విధంగా సర్వవ్యాప్తినంటూ చూపించే విధంగా ఆలయాన్ని వినూత్నంగా నిర్మించాలని తలచారు విఠల్‌రావు.

“నాపై దృష్టి నిలిపితే నీపై నా కృపా దృష్టిని నిలుపుతాను” అనే మాటలకు నిదర్శనంగా నిత్యం సాయి నామస్మరణ చేసే విఠల్‌రావు బాబా ఆశీస్సులతో  సాయిబాబా విగ్రహ నిర్మాణం 2004లో  ప్రారంభించారు. భక్తులు ఇచ్చిన విరాళాలతో, చందాలతో విగ్రహానికి కావలసిన డబ్బు సమకూరింది. మాణిక్య రావు డిజైన్ చేసి నిర్మించారు. గుడి కింది నుంచి రెండవ అంతస్తు నిర్మించి బయటకు అందరికీ కనిపించే విధంగా బాబా విగ్రహ నిర్మాణం చేశారు.

చేతులకు ఇరువైపుల దుష్టశిక్షణకు సిద్ధంగా మేమున్నామంటూ గాండ్రిస్తున్న రెండు సింహపు ముఖాలతో చూడ ముచ్చటగా ఉన్న పెద్ద సింహాసనం. తలపై ఆదిశేషుని పడగ ఛత్రంలా ఉండగా చిరుమందహాసంతో సాయినాధుడు సింహాసనంపై ఆశీర్వదిస్తూ కూర్చోగా, ఎడమ కాలి కింద కూర్మాన్ని ముక్కాలి పీటగా చేసుకుని అందరికీ దర్శనమిస్తున్న ఈ విగ్రహం ఎత్తు ‘54 అడుగుల’తో సిమెంట్, ఐరన్‌తో నిర్మించారు.


అప్పటి వరకు ఇంత ఎతైన విగ్రహాన్ని ప్రపంచంలోనే ఎవరూ నిర్మించలేదు. ఈ నిర్మాణం 2007లో పూర్తయింది. 2010లో ద గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డుకు ఎక్కింది.  గుడిలోపల గురుదర్బార్‌లా, జ్ఞాన బోధ చేసిన గురువులందరిని ఒక్క చోటకు చేర్చినట్టుగా అక్కడ ఒకవైపు నిర్మించారు. సాయి భక్తులకు సాయి జీవిత చరిత్రను మరింత దగ్గర చేసేందుకు రెండవ అంతస్థులో బాలలతో సాయిసచ్చరిత్ర ను డాక్యుమెంటరీ ఫిల్మ్‌గా తీసారు.

ఆలయ కార్యక్రమాలు

బాబా ఫొటోతో ప్రారంభమైనప్పటి ఆలయ కార్యక్రమాలు ఇప్పటికి యథావిధిగానే  జరుగుతున్నాయి. ప్రతి రోజు ఉదయం ప్రాతఃకాలంలో 5 గంటలకు కాగడా హారతితో ప్రారంభమై, మధ్యాహ్న హారతి, సంధ్యా హారతి, రాత్రి పవళింపు హారతితో ముగుస్తుంది. ప్రతి గురువారం రెండు వేల నుంచి రెండు వేల ఐదు వందల మంది భక్తులకు నిత్యాన్నదానం.

ప్రతి శని, ఆదివారాలు సాయంత్రం 4 గంటల నుంచి 6 గంటల వరకు స్వయంగా విఠల్‌రావు, తదితర భక్తులందరూ కలిసి సత్సంగం నిర్వహిస్తారు. ఈ సత్సంగంలో బాబా సచ్ఛరిత్ర పారాయణం,  బాబా విశేషాలను వివరించటం జరుగుతుంది. విఠల్‌రావు ఆ రోజులలో ఎక్కడికి వెళ్లినా స్కైప్ ద్వారా అయినా ప్రసంగిస్తారు కాని ఎప్పుడూ ఈ కార్యక్రమాన్ని మిస్ చేయలేదు. సర్వేజనా సుఖినోభవంతు

చిరునామ

సాయి మహరాజ్ దేవాలయం, జిల్లాకోర్టు సెంటర్,  మచిలీపట్నం, కృష్ణాజిల్లా, ఆంధ్రప్రదేశ్.
Previous
Next Post »