శంతనుడి జన్మ వృత్తాంతం




భారతం కథ శంతన మహారాజుతోనే మొదలవుతుంది. కురువంశానికి చెందిన శంతనుడు హస్తినాపురాన్ని పరిపాలించాడు. భీమసేనుని కొడుకు ప్రతీపుడు. ప్రతీపుని కొడుకు శంతనుడు. దేవాపి ఇతని అన్న. బాహ్లికుడు ఇతని తమ్ముడు. అయితే ప్రతీపుడు అడవికి తపస్సుకు వెళుతూ – గంగ వరించిన విషయమూ – కొడుకుకు భార్యవి కమ్మని కోరిన విషయమూ శంతనునికి చెప్పాడు. గంగా తీరానికి వస్తే ఆమెని పెళ్ళాడమన్నాడు. అన్న దేవాపి కూడా రాజ్యం వదిలి వెళ్ళాడు. శంతనుడి పాలనలో పన్నెండేళ్ళు వర్షాలు లేవు. కరువు. అన్నవుండగా తమ్ముడు రాజు కావడమే కష్టాలకు మూలమని పండితులు చెప్పారు. దాంతో దేవాపిని వెతికి తీసుకొచ్చినా అతను అప్పటికే వేద విద్యను స్వీకరించి ఉండడంతో తిరిగి శంతనుడే రాజయ్యాడు. రాజ్యం సస్యశ్యామలమయ్యింది!

            గంగానది అందాల అతివగా మారి ఒడ్డున తిరుగుతూ ఉంది. ఆమె సౌందర్యానికి మంత్ర ముగ్దుడయిపోయి మోహించాడు శంతనుడు – పెళ్ళాడమని ప్రాథేయ పడ్డాడు. సరేనంటూ గంగాదేవి కొన్ని షరతులు పెట్టింది. నేనెవరో – ఎక్కణ్నుంచి వచ్చానో – నా వాళ్ళెవరో – కులమేదో అడగ వద్దంది. దేనికీ అడ్డు చెప్పవద్దంది. శంతనుడు గంగాదేవిని వదులుకోలేక సరేనన్నాడు. ఒప్పుకోవడంతో పెళ్ళి జరిగిపోయింది. ఆదరాభిమానాలతో అన్యోన్యంగానే కాలం కరిగిపోయింది. ఒకరి తర్వాత ఒకరు ఏడుగురు బిడ్డల్ని కన్నది. ప్రతి బిడ్డనూ తీసుకెళ్ళి గంగానదిలో విసిరేసి వచ్చింది. ఎనిమిదో బిడ్డనూ తీసుకెళ్ళబోతుంటే గంగాదేవిని శంతనుడు అడ్డుకున్నాడు. ఉండ బట్టలేక అడిగాడు. అంతే ఇచ్చిన మాట మీరారని చెప్పి బిడ్డతో సహా వెళ్ళబోయింది. కన్నీరయి కాళ్ళ మీద పడ్డాడు శంతనుడు. కనికరించలేదు. పూర్వ జన్మ వృత్తాంతం చెప్పింది. ఎనిమిది మంది వసువులు భార్యలతో కూడి విహారానికి వచ్చారు. వసిష్టమహర్షి హోమథేనువును దొంగతనంగా తోలుకు పోయారు. దివ్య దృష్టితో కారణం తెలుసుకున్న వసిష్టుడు భూలోకంలో పుట్టమని శపించాడు. శాప విముక్తి కోరారు వసువులు. పుట్టిన వెంటనే గిట్టి శాపవిముక్తులు కమ్మన్నాడు వసిష్టుడు. తప్పుకు ముందున్న ఎనిమిదో పసువు ప్రభాసుడు మాత్రం చాలాకాలం జీవించేలా శపించాడు. అయితే పేరు ప్రఖ్యాతులు గడిస్తావని ఊరటగా చెప్పాడు. అప్పుడు ఆ ఎనిమిది మంది వసువులు వచ్చి గంగానదిని వేడుకోగా సరేనని అంగీకరించింది. అదీ వెనకటి కథ. ఆ ప్రకారమే ఎనిమిదో బిడ్డను తనతో తీసుకుపోయింది. ఆ బిడ్డకు దేవవ్రతుడని పేరుపెట్టి, పెంచి పెద్ద చేసింది. తిరిగి శంతనునికి యువకుడైన కొడుకుని అప్పగించింది. అతన్ని యువరాజుని చేసాడు.

            తరువాత కాలంలో శంతనుడు యమునా నదీతీర విహారంలో మత్స్య గంథి అయిన సత్యవతిని చూసాడు. పెళ్ళాడమని కోరాడు. తన తండ్రి అనుమతి కావాలంది. తండ్రైన దాసరాజును కలిసి శంతనుడు తన మనసులో కోరికను బయట పెట్టాడు. నా కూతురుకు పుట్టిన వాడే రాజు కావాలి – దాసరాజు పెట్టిన షరతుకు తలవంచలేదు. అలాగని మరిచిపోలేదు. శంతనుడు మనో వ్యాధికి లోను కావడంతో దేవవ్రతుడు వెళ్ళి దాసరాజుని కలిసి – షరతుకు అంగీకరించాడు. రాజ్యాన్ని పరిత్యజించడమే కాదు, పెళ్ళికూడా చేసుకోనని భవిష్యత్తు భయం లేకుండా భీష్మించాడు. ప్రతిజ్ఞ చేసాడు. అలా భీష్ముడి ప్రతిజ్ఞకు దాసరాజు తలవంచాడు. సత్యవతి శంతనుని భార్య అయింది. ఇద్దరు పిల్లల్ని కూడా కన్నాడు. వారే చిత్రాంగదుడు, విచిత్ర వీర్యుడు.

అయితే ఏ కొడుకూ చేయనిపని చేసినందుకు మెచ్చి శంతనుడు – స్వచ్ఛంద మరణం అంటే కోరుకున్నప్పుడు మరణించేలా వరాన్ని కొడుకు భీష్ముడికి ఇస్తాడు! కొడుకు ఋణం ఆవిధంగా తీర్చుకున్నాడన్నమాట!.
Previous
Next Post »