ముక్తి ని చేరుకునే మార్గాలు


ధర్మాచరణలోనే దైవశక్తి సమకూరుతుంది. ధర్మాచరణ సాగాలి అంటే ధర్మావగాహన ఉండాలి. అట్టి అవగాహనను శాస్త్రాలు అందిస్తాయి. చెబుతాయి. ఈ చెప్పే విధానములో ఉండే ప్రత్యేకతలను బట్టి ఒకే విషయాన్ని ఉద్భోదిస్తున్నా, అవి అనేక విధాలుగా గోచరిస్తూ ఉంటాయి.




యజమాని సేవకుని ఆజ్ఞాపించి పనిచేయిస్తాడు. ప్రభుత్వాలు ఉత్తర్వులు జారీచేసి శిస్తు కట్టిస్తాయి. ఇది ఒక ఆజ్ఞ. ప్రభువాజ్ఞ. అందరూ పాటించవలసిన ఆజ్ఞ. ఇష్టా యిష్టాలు ఇక్కడ చెలామణి కావ్ఞ. చెప్పింది చేయటమే. ఇది ప్రభు సమ్మితము.
వేదాలు ప్రభు సమ్మితాలు. తిరుగులేని జ్ఞానంతో ఆజ్ఞాపించే శక్తిగలవి. అందుకే అవి ప్రమాణాలై శోభిస్తున్నాయి. చెక్కుచెదరని, మొక్కవోని తేజముతో, శక్తితో ప్రకాశిస్తూ ఉన్నాయి. (యద్వేదాత్‌ ప్రభు సమిమతా దధిగతం శబ్ద ప్రమాణాచ్చిరమ్‌).
ఇక రెండవ విషయం, పురాణాలు. ఇవి కూడా వేదజ్ఞానాన్నే అందిస్తాయి. వేద ప్రయోజనం ఏమిటో పురాణ ప్రయోజనం కూడా అదే. కాకపోతే, దుర్గమమనుకున్న దానిని సుగమం చేస్తాయి పురాణాలు.
జటిలమైన విషయాన్ని కూడా సరళంగా బుద్ధికి పట్టిస్తాయి. కథల రూపంలో ఉత్సాహాన్ని రేకెత్తిస్తూ కట్టిపడేస్తాయి. ఆజ్ఞలు కాకుండా ఆప్యాయతతో ప్రియంగా బోధిస్తాయి. కనుక పురాణాలు ప్రభు సమ్మితాలు కావ్ఞ; మిత్ర సమ్మితాలు. స్నేహపాత్రంగా తోడు నిలుస్తాయి.

(యచ్ఛార్థ ప్రవణాత్‌ పురాణ వచనాదిష్ఠ సుహృద్సమ్మితాత్‌).
ఉపయుక్తమైన విషయం యజమాని చెప్పినా, మిత్రుడు చెప్పినా ఆచరించదగినదే. కాకపోతే, ఆజ్ఞాపించి ప్రభువ్ఞ చేయిస్తే, ఆప్యాయంగా మిత్రుడు చేయిస్తాడు. ఈవిషయాన్ని ఇంకా బాగా గ్రహించి మూడవ విషయంలోకి వెళ్దాము.
‘మద్యపాన నిషేధం, ధూమపాన నిషేధం-అని ప్రభువ్ఞ లేదా ప్రభుత్వ ఆజ్ఞాపిస్తే, ప్రజలు ఇష్టమున్నా లేకపోయినా ఆచరించక తప్పదు కదా!
కాని, మిత్రుడు మద్యపానం ఎలా మంచిది కాదో, ధూమపానం వల్ల ఆరోగ్యం ఎలా పాడు అవ్ఞతుందో హితోపదేశం చేస్తాడు. ఈ విషయంలో ఎక్కడెక్కడ, ఎవరెవరికి ఏమి జరిగిందో, ఎలా జరిగిందో కథారూపంగా కళ్ళకు కట్టినట్లు వర్ణిస్తాడు. ప్రేమతో వివరిస్తాడు.
కష్టాలెదురైనా ధర్మాన్ని వీడకూడదు. అధర్మంతో వచ్చే సుఖాలు అభిలషణీయాలు కావ్ఞ. ధర్మంతో పాండవ్ఞలు ఎలా శోభించారో, అధర్మంతో కౌరవ్ఞలు ఎలా పతనమయ్యారో హాయిగా, రుచికరంగా వినిపిస్తాడు. స్నేహితునిలో మార్పును సృష్టిస్తాడు.
వేదాలు ఆజ్ఞాపించి ప్రభు సమ్మితాలుగా భాసిస్తే, పురాణాలు కథలు వల్లించి మిత్ర సమ్మితాలుగా, లేదా సుహృత్సమ్మితాలుగా శోభిస్తున్నాయి. ఇది మంచి మిత్రుడుగా పురాణాలు చేసే మంచి పని. స్నేహితుడు అసత్యం పలకడు. చెడు చేయడు. నిజమిత్రుడు ఏది చేసినా, ఏది పలికినా అది మన మంచికే. పురాణాలు అక్షరాలా అలాగే ఉన్నాయి. ఉంటాయి. ఇక మూడవ విషయం కావ్యాలు. ఇవి కూడా హితం చేసేవే. అయితే, వేదాల వలె ఆజ్ఞాపించవ్ఞ. స్నేహితుని వలె కేవలం సత్యభాషణమే చేయవ్ఞ. సత్యమును స్నేహితుని వలె ప్రియంగా చెప్పటంతో పాటు కాస్త సరసాన్ని తగుపాళ్ళలో సమరసం చేసి అందిస్తాయి. సత్యాన్నే ప్రవచిస్తున్నా, చమత్కారాన్ని జోడించి రసపూర్ణంగా భాషించటం భార్యకే తెలుసు. కనుక కావ్యాలు కాంతాసమ్మితాలు (కాంతా సమ్మితయా యయా సరసతామాపాద్య కావ్యాశ్రియా). కాంతలలో స్వేచ్ఛాకాంతులు వెల్లివిరుస్తూ ఉంటాయి. అవసరమైతే ఉప్మాలో ఉత్ప్రేక్షని, ఆవకాయలో అతిశయోక్తిని రంగరించి వడ్డించినా అందులో అధికోత్సాహమే గాని నీరసం ఇసుమంతైనా ఉండదు. ఈవిధమైన స్వాతంత్య్రాన్ని స్నేహితుడు తీసుకోడు. ప్రభువు అభిలషించడు. కవ్ఞలు ఏదైనా చెబుతారు; ఎలాగైనా చెబుతారు. ”పార్వతి చాలు గంగను విడువ్ఞఅని శివ్ఞనికే మొరపెట్టుకొని జ్ఞానదాహాన్ని తీర్చుకోగలరు. ఆ పని పురాణాలు, వేదాలు చేయలేవ్ఞ. మిత్రుడు కేవలం హితాన్ని మాత్రమే బోధించి స్నేహి తుని మార్చాలని చూస్తాడు. భార్య అలా కాదు. భర్తను మార్చే ప్రయత్నంలో కొంత ఊహని కూడా జోడిస్తుంది. భావ్ఞకతను కలుపుతుంది. మొత్తానికి ఏదో కలగూరతో కమ్మగా వడ్డిస్తుంది. ఇదంతా సరసమే. సమరస చమత్కారమే. మార్పును వాంఛించి భుజానికెత్తుకున్న పనిభారమే. ముగ్గురు మూడు రకాలుగా చెబుతున్నా విషయమొక్కటే. ప్రయోజనమూ ఒక్కటే. ప్రభు సమ్మితాలుగా వేదాలు, మిత్ర సమ్మితాలుగా పురాణాలు, కాంతా సమ్మితాలుగా కావ్యాలు, కవితలు మనిషిని ప్రగతి మార్గంలో నడిపిస్తున్నాయి. కొందరు వేదార్థాన్ని, ఉపనిష ద్వైభవాన్ని వినిపిస్తారు. కొందరు పురాణ ప్రవచనం చేస్తారు. మరికొందరు కవితలల్లుతారు. అన్నీ మానవ కళ్యాణానికే.
కాని, కొందరు మూడుకార్యాలు ముచ్చటగా చేయగలుగుతారు. వారు త్రివేణీ సంగమం లాంటివారు. మునక వేస్తే చాలు. ముక్తికి చేరువగుటయే గాని మునిగిపోవటం ఉండదు.
Previous
Next Post »